రజనీ చిత్రంలో ఛాన్స్‌ అడిగిన హాలీవుడ్‌ స్టార్‌
‘‘నాకు రజనీకాంత్‌ చిత్రంలో నటించాలనుంది. ఓ అవకాశమివ్వరూ’’ అంటూ మురుగదాస్‌కు ట్వీట్‌ చేశారు ఓ ప్రముఖ హాలీవుడ్‌ నటుడు. ఇంతకీ ఆయన మరెవరో కాదు బిల్‌ డ్యూక్‌. ‘ఎక్స్‌మ్యాన్‌: ద లాస్ట్‌ స్టాండ్‌’, ‘ట్విలైట్‌’ సిరీస్‌, ‘ప్రిడేటర్‌’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు డ్యూక్‌. తాజాగా ఈ హాలీవుడ్‌ నటుడు చేసిన ట్వీట్‌కు దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌ షాకయ్యారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో నటించాలనుందంటూ డ్యూక్‌ ట్విటర్‌ వేదికగా రజనీకాంత్‌ను, మురుగదాస్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘మురుగదాస్‌.. నాకు తమిళం రాదు. కానీ మీరు తీస్తున్న ‘దర్బార్‌’ సినిమాలో నటించాలని ఉంది. నేను రజనీకాంత్‌ సోదరుడి పాత్రలో కానీ నయనతారకు అంకుల్‌ పాత్రలోనైనా నటిస్తాను. అనిరుధ్‌ రవిచందర్‌ మాలాంటి స్టార్‌ నటుల కోసం ఓ మంచి పాటను కూడా కంపోజ్‌ చేస్తే బాగుంటుంది. ఏమంటారు?’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ చూసిన మురుగదాస్‌ షాకయ్యారు. ‘‘సర్‌.. ఇది నిజంగా మీరేనా?’’ అని ప్రశ్నించారు. ఇందుకు బిల్‌ డ్యూక్‌ సమాధానంగా.. ‘‘హాలీవుడ్‌లో ఏజెంట్లు, మేనేజర్లు మా పనికి సంబంధించిన విషయాలను చూసుకుంటారు. కానీ మనలాంటి నటులు, దర్శకులు, రచయితలు, ఆర్టిస్ట్‌లు అద్భతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం మంచి సినిమాను అందించాలని కలలు కంటూ ఉంటాం’’ అని ట్వీటారు. మరి బిల్‌ డ్యూక్‌ కోరిక మేరకు మురుగదాస్‌ ఆయనకు సినిమాలో అవకాశం ఇస్తారో లేదో వేచి చూడాలి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.