ఈ పోస్టర్‌కు అంత కథ ఉంది..
చిరంజీవి నుంచి ఓ సినిమా వస్తుందంటే అభిమానుల్లో కనిపించే సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆయన తన కలల ప్రాజెక్టు ‘సైరా’తో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రస్తుతం దీనికి బాక్సాఫీస్‌ వద్ద మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడీ చిత్ర ఫలితం ఇచ్చిన ఉత్సాహంలోనే చిరు తన 152వ చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మించబోతున్నారు. ఇంకా రెగ్యులర్‌ షూట్‌కు కూడా వెళ్లని ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సర్‌ప్రైజ్‌ పోస్టర్‌ ఒకటి బయటకొచ్చింది. అందులో చిరు ఓ సీరియస్‌ లుక్‌తో నక్సలైట్‌ డ్రెస్‌తో పవర్‌ఫుల్‌గా దర్శనమిచ్చారు. అంతేకాదు.. దీనికి ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. కానీ, వాస్తవమేంటంటే.. ఇది చిత్ర బృందం నుంచి అధికారికంగా విడుదలైన పోస్టర్‌ కాదు. ఇది ఎవరో చిరు అభిమానులు రూపొందించిన ఫస్ట్‌లుక్‌ ఇది. కానీ, దీన్ని తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే నిజమైన పోస్టరేమో అన్నంత చక్కగా రూపొందించారు. తాజాగా దీనిపై చిత్ర బృందం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న పోస్టర్‌ కానీ, చిత్ర టైటిల్‌ కానీ అసలైనవి కాదని.. తాము అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి పుకార్లను నమ్మొద్దని కొణిదెల ప్రొడక్షన్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేసింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.