స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు. నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాత. మంగళవారం జగపతిబాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ‘సైరా నరసింహారెడ్డి’లో జగపతిబాబు లుక్‌ని విడుదల చేశారు. ఆయన వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నట్టు చిత్రబృందం స్పష్టం చేసింది. చారిత్రాత్మక కథగా రూపొందుతున్న చిత్రమిది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో నటీనటుల వేషధారణలు దర్శనమిస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రత్నవేలు, సంగీతం: అమిత్ త్రివేది.
