యముడిగా మరోసారి మురిపించేందుకు!
యముడి పాత్రలకు పెట్టింది పేరు కైకాల సత్యనారాయణ. ముఖ్యంగా ‘యమలీల’ చిత్రంలో యముడిగా కైకాల చేసిన సందడి అంతఇంత కాదు. తాజాగా ఈ సీనియర్‌ నటుడు మరోసారి యముడి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌ భవ’. కార్తిక్‌ రాజు, మిస్తి చక్రవర్తి నాయకానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి పూర్ణానంద్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంవీకే రెడ్డి సమర్పణలో ప్రతిమ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తర్వాత కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో ఈ సినిమాలో అలరించనున్నారు. చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యమున్న చిత్రమిది. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకోని అక్టోబరు నెలాఖరులో సినిమాను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఆమని, పృథ్వీరాజ్, జెమిని సురేష్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.