వహ్‌.. తాజ్‌! అంటున్న కాజల్‌
తాజ్‌ మహల్‌ ప్రపంచ వింతల్లో ఒకటి. అందమైన కథానాయికల్లో ‘చందమామ’ కాజల్‌ ఒకరు. మరి ఈ చందమామ తాజ్‌ మహల్‌ చెంతకు చేరితే చూడటానికి రెండు కళ్లు సరిపోవేమో కదా. అంతేనా ప్రేమకు చిహ్నమైన ఈ అద్భుత ఈ కట్టడం గురించి ఈ కలువ కళ్ల భామ తన మనసులో మాట చెప్తే ఎలా ఉంటుంది? మనం కూడా వహ్‌ తాజ్‌ అనాల్సిందే. కాజల్‌ తొలిసారి తాజ్‌ను సందర్శించడంతో పట్టలేని ఆనందాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'తాజ్‌మహల్‌ను తొలిసారి చూసి ఫిదా అయ్యా, నోట మాట రాలేదు. దీని గొప్పతనం తెలుసుకుని ఆశ్చర్యపోయా. నా జీవితంలో ఇప్పటి వరకు చాలా సార్లు మనసును ఆకర్షించే తాజ్‌ అందం గురించి విన్నాను. కానీ, తొలిసారి తాజ్‌లోని శిల్పకళ, ధ్వని తదితర విషయాన్ని స్వయంగా ఆస్వాదించా. నా మనసులో చెరగని ముద్ర పడిపోయింది, వండర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌' అని ఆమె ఓ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. కాజల్‌ తన తండ్రి వినయ్‌తో కలిసి తాజ్‌ను చూసేందుకు వెళ్లారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు. అంతేకాదు ఇదే సందర్భంగా కాజల్‌ ప్రేమపై తన అభిప్రాయాన్ని కూడా పేర్కొన్నారు. 'ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ నన్ను ఇప్పుడు దీని గురించి మాట్లాడేలా చేస్తోంది. నా ఆలోచనలు పంచుకునే అవకాశం వచ్చింది... ' అంటూ ఓ పోస్ట్‌ చేశారు. 'రణరంగం'తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్‌ ప్రస్తుతం 'పారిస్‌ పారిస్‌', 'కాల్‌ సెంటర్‌', 'ముంబయి సెగా', 'అ 2', 'భారతీయుడు 2' చిత్రాల్లో నటిస్తున్నారు.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.