బాధిత మహిళలపై బురద చల్లకండి..

‘మీటూ’ ఉద్యమం రోజురోజుకు మరింత పదునెక్కుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కరొక్కరిగా బాధితులంతా తమకు జరిగిన అన్యాయాల్ని ధైర్యంగా బయటకు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ వ్యవహారంలోకి వచ్చి చేరుతున్నాయి. మరోవైపు ఈ ఉద్యమంలో భాగంగా అన్ని చిత్ర పరిశ్రమల్లోని తారామణులంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. ‘మీటూ’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ బాధితుల తరపున మద్దతుగా నిలుస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి సమంత, అనుపమ పరమేశ్వరన్, చిన్మయి తదితరులంతా ఇప్పటికే ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేయగా.. తాజాగా నటి కాజల్‌ కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. ‘‘మహిళల్ని హింసించే రాక్షసుల గురించి నోరు విప్పి చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి. తాము ఎదుర్కొన్న సమస్యలను బయటపెడుతూ.. తమకు తామే మద్దతును తెలుపుకుంటున్న మహిళలందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను. ఇంతవరకు తమ అభిప్రాయాల్ని వెల్లడించిన మహిళల పట్ల ఎలాంటి దారుణ ఘటనలు జరిగాయో నేను ఊహించలేను. కానీ, మనం ఒకరికి ఒకరం సహకరించుకోవాలి. కష్టకాలంలో తోడుగా, నిజాయితీగా నిలవాలి. కేవలం ప్రచారం కోసమే నటీమణులు తమ వేధింపుల గురించి బయటపెడుతున్నారని అనుకునేవారందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. వారిని తక్కువ చేసి చూస్తూ.. ఇంకా బురద చల్లాలని చూడకండి’’ అని అంది కాజల్‌. ఇక ఈ వ్యవహారంపై బుల్లితెర వ్యాఖ్యాత, నటి అనసూయ కూడా స్పందించింది. ‘‘పనిచేసే చోట లైంగిక వేధింపులు అత్యంత దురదృష్టకరం. ఈ బాధితుల్లో మహిళలే కాదు.. చిన్నపిల్లలూ.. ఆఖరికి మగవాళ్లు కూడా ఉంటున్నారు. ఎవరి ప్రలోభాలకు లొంగకుండా.. ధైర్యంగా ఉంటే లైంగిక వేధింపుల బారిన పడకుండా ఉండొచ్చు. నేను చూసినంత వరకు టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు తక్కువే’’ అన్నారు. 


© Sitara 2018.
Powered by WinRace Technologies.