‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ తొలిరోజు వసూళ్లు..

నటసార్వభౌముడి నందమూరి తారక రామారావు జీవితకథను ‘ఎన్టీఆర్‌’ పేరుతో దృశ్యకావ్యంగా మలిచారు దర్శకుడు క్రిష్‌ - కథానాయకుడు బాలకృష్ణ. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం నుంచి తొలి పార్ట్‌.. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’గా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎన్టీఆర్‌గా తన తండ్రి పాత్రలో బాలయ్య కనబర్చిన నటనకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో తొలిరోజు మంచి వసూళ్లు రాబట్టింది ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’. ఈ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.7.61 కోట్ల షేర్‌ రాగా.. ఇందులో అత్యధికంగా ఒక్క గుంటూరు ఏరియా నుంచే రూ. 2.04 కోట్లు రావడం విశేషం. దీని తర్వాత నైజాం రూ. 1.72 కోట్లు, సీడెడ్‌ రూ.80 లక్షలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ను రాబట్టడం విశేషం. ఈ క్రమంలో తన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంతో పాటు విజయ్‌ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రాల వసూళ్ల రికార్డును బ్రేక్‌ చేస్తూ.. ప్రిమియర్‌ షోల ద్వారా 5,19,000 డాలర్లు (దాదాపు రూ.3.5 కోట్లు) వసూళ్లను కొల్లగొట్టింది ‘కథానాయకుడు’. ఈ సినిమాలో బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటించగా.. శ్రీదేవిగా రకుల్, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, సావిత్రిగా నిత్యమేనన్, ఏయన్నార్‌గా సుమంత్‌ తదితరులు నటించారు. ఈ సినిమాను వారాహి చలనచిత్ర, విబ్రి మీడియా సమర్పణలో సాయి కొర్రపాటి, విష్ణు వర్థన్‌ ఇందూరి, నందమూరి బాలకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత వ్యాసాలు


© Sitara 2018.
Powered by WinRace Technologies.