నీటి ఆదాపై.. నాగ్‌ అశ్విన్‌ సరికొత్త ఛాలెంజ్‌

‘రైస్‌ బకెట్‌ ఛాలెంజ్‌’, ‘ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌’.. అంటూ ఇప్పటికే సోషల్‌ మీడియాలో అనేక రకాల సామాజిక బాధ్యతలపై ఛాలెంజ్‌లు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో మరో వినూత్న ఛాలెంజ్‌ వచ్చి చేరింది. దాని పేరే ‘వన్‌ బకెట్‌’ సవాల్‌. ప్రస్తుతం దేశంలో అనేక ప్రాంతాల్లో ఎదురవుతున్న నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకోని.. దానికి పరిష్కార మార్గంగా ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా.. ప్రతిఒక్కరూ కనీసం ఒక్కరోజైనా తమ రోజువారీ అవసరాలను కేవలం ఒకే బకెట్‌ నీటితో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే.. స్నానం చేయడం దగ్గర నుంచి చేతులు శుభ్రం చేసుకోవడం వరకు అన్ని అవసరాలను ఒకే బకెట్‌ నీళ్లతో తీర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల నీటిని ఆదా చేయడంతో పాటు.. ప్రతిఒక్కరికీ నీటి ప్రాముఖ్యతను తెలియజేయగలుగుతామని ఆయన తెలియజేశారు. రాబోయే ఆదివారం నాడు (జులై 21న) అందరూ ఒక బకెట్‌ నీటిని మాత్రమే ఉపయోగించి వారి సామాజిక బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. మరి ఈ ఛాలెంజ్‌ను ఎంత మంది స్వీకరిస్తారో వేచి చూడాలి. ప్రస్తుతానికి దీనిపై నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.