‘నిశ్శబ్దం’గా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు..
‘భాగమతి’ వంటి హిట్‌ తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్‌, అవసరాల శ్రీనివాస్‌, అంజలి, షాలిని పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు మైకేల్‌ మాడిసన్‌ ఓ ముఖ్యపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, పాత్ర వివరాలను విడుదల చేసింది చిత్ర బృందం. మైకేల్‌ ఈ చిత్రంలో రిచర్డ్‌ డికెన్స్‌ అనే పాత్రలో కనిపిస్తారట. చిత్రంలో అనుష్క కేసుకు సంబంధించి విచారణ జరిపే పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా ఆయన దర్శనమిస్తారు. పోస్టర్‌లో ఆయన సూటు బూటుతో నల్లటి చలువ కళ్లద్దాలు పెట్టుకోని సీరియస్‌ లుక్స్‌తో స్టైలిష్‌గా కుర్చీలో కూర్చోని కనిపించారు. దీనికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బయటకొచ్చిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది ఈ చిత్రం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.