చినుకుల్లో చిందేసిన రకుల్‌!
‘ఎన్టీఆర్‌’ కథంటే ఆయనొక్కరి కథ కాదు. ఆయనతో పాటు చాలామంది తారల కథలు చెప్పాలి. ఏఎన్నార్, సావిత్రి, ఎస్వీఆర్, శ్రీదేవి.. ఇలా అలనాటి నటీనటుల్ని వెండి తెరపై చూపించాలి. శ్రీదేవిగా ఎవరు కనిపిస్తారు? అనే ప్రశ్నకు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సమాధానంలా దొరికేసింది. ఇప్పుడు రకుల్‌ శ్రీదేవిగా మారి... ‘ఎన్టీఆర్‌’ సెట్లో అడుగుపెట్టింది. ఎన్టీఆర్‌ రూపంలో ఉన్న బాలయ్యతో చిందులు వేసింది. క్రిష్‌ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, రకుల్‌లపై ‘వేటగాడు’లోని ‘ఆకు చాటు పిందె తడిసె’ అనే పాటని తెరకెక్కిస్తున్నారు. బుధవారం రకుల్‌ప్రీత్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్‌’లో శ్రీదేవి లుక్‌ని విడుదల చేశారు. ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటకు సంబంధించిన స్టిల్స్‌నీ బయటకు వదిలారు. ఈ చిత్రం ‘కథా నాయకుడు’, ‘మహా నాయకుడు’ అనే రెండు భాగాలుగా విడుదల అవుతోంది. ‘కథానాయకుడు’ని ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.