ఎంతో తృప్తిగా ఉంది

సమంత ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘ఓ బేబీ’. ఎంత సక్కగున్నావే... అనేది ఉపశీర్షిక. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆ విషయాన్ని సమంత ఇన్‌స్టగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమైనదంటూ ఆమె పేర్కొన్నారు. కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’ ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇందులో సమంత రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ‘ఓ బేబీ’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సమంత తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘నాదైన దిశని నేను కనుక్కోవడంలో సహాయం చేసిన దేవుడు, వ్యక్తుల పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉంటా. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి నేను కొంచెం సమయం తీసుకున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. కానీ ఈ రోజు నా ఎదుగుదలపై చాలా సంతృప్తిగా ఉన్నా. దర్శకురాలు నందిని రెడ్డి నాకు అత్యంత ఇష్టమైన పాత్రని ఇచ్చారు’’ అని ఇన్‌స్టగ్రామ్‌లో రాసుకొచ్చారు సమంత. త్వరలోనే ఆమె తన భర్తతో కలిసి నటించిన ‘మజిలీ’తో సందడి చేయబోతున్నారు.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.