ఈ లుక్‌ ‘యన్‌.టి.ఆర్‌’ కోసమేనా?
తాత అక్కినేని నట వారసత్వంతో వెండితెరపై మెరిసినా.. తనదైన ప్రతిభతోనే నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు హీరో సుమంత్‌. ఇప్పుడీ యువ కథానయకుడు తొలిసారి తన తాత ఏయన్నార్‌ పాత్రలో ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో సందడి చేయబోతున్నాడు. మహానటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా బాలకృష్ణ నిర్మిస్తున్న చిత్రమిది. ఆయనే టైటిల్‌ పాత్ర పోషిస్తున్నాడు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ఏయన్నార్‌ పాత్ర కోసం సుమంత్‌ను ఎంపిక చేసుకుంది చిత్ర బృందం. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొదలు కాబోతుంది. ఏయన్నార్‌గా సుమంత్‌ ఫస్ట్‌లుక్, టెస్ట్‌లుక్‌ ఏదీ ఇప్పటి వరకు బయటకు రానప్పటికీ.. తాజాగా సుమంత్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోతో తన పాత్ర ఎలా కనిపించబోతున్నది చూచాయగా చూపించేశాడు. ఈ ఫొటోలో సుమంత్‌ క్లీన్‌ షేవ్‌తో రొమాంటిక్‌ లుక్స్‌తో ఆకట్టుకునేలా కనిపించాడు. ‘‘5 సంవత్సరాల తర్వాత క్లీన్‌ షేవ్‌. గడ్డం, మీసం లేకుండా క్లిన్‌ షేవ్‌లో ఎలా ఉంటానో దాదాపు మర్చిపోయాను.. రాబోయే తాజా చిత్రం కోసం కొత్త లుక్‌’’ అని ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను కూడా జత చేశాడు. మొత్తానికి సుమంత్‌ ఎక్కడా సినిమా పేరు బయటకు చెప్పకపోయినా.. ఆ లుక్‌ను బట్టీ అది ‘యన్‌.టి.ఆర్‌’ కోసమే అని నెటిజన్లు అంతా కామెంట్స్‌ పెడుతున్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.