కల నిజమైన వేళ..
తమిళ కథానాయకుడు సూర్య, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధానపాత్రల్లో తెరకెక్కనున్న తమిళ మల్టీస్టారర్‌లోకి మరో యువ కథనాయకుడు వచ్చి చేరాడు. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్ర కోసం అల్లు శిరీష్‌ను ఎంపిక చేసుకున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమాను లైకా సంస్థ నిర్మించనుంది. శిరీష్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకొన్నారు. ‘‘సూర్య, మోహన్‌లాల్‌ నటించబోయే చిత్రంలో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది. సూర్య అభిమానినైన నాకు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం కల నిజమైనట్లుగా ఉంది. మోహన్‌లాల్‌ సార్‌తో మరోసారి తెరపంచుకోబోతున్నందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చిత్రబృందానికి ధన్యవాదాలు’’ అంటూ సంతోషంగా ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా జూన్‌ 25 నుంచి పట్టాలెక్కబోతోంది. అల్లు శిరీష్‌, మోహన్‌లాల్‌తో కలిసి మలయాళంలో ఓ మల్టీస్టారర్‌ మూవీ చేశారు. దీన్ని ‘1971 భారత సరిహద్దు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. సూర్య, ఆనంద్‌ల కలయికలో గతంలో ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్‌’ వంటి హిట్‌ చిత్రాలొచ్చిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సూర్య ప్రస్తుతం సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ అనే చిత్రం చేస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సాయిపల్లవి కథానాయికలు.© Sitara 2018.
Powered by WinRace Technologies.