బ్రేక్‌ ఈవెన్‌కు ‘సైరా’ అంత దూరంలో..

‘‘చరిత్రలో మనం ఉండకపోవచ్చు.. కానీ, చరిత్ర మనతోనే మొదలవ్వాలి’’ అంటూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల చరిత్రలు తిరగరాసేందుకు దూసుకొచ్చాడు ‘సైరా’. చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మించారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. తొలిరోజు నుంచే మంచి టాక్‌తో చక్కటి వసూళ్లు దక్కించుకొంది. పండగ సెలవులకు తోడు ఆర్టీసీ బంద్‌ కారణంగా పాఠశాలలకు మరిన్ని సెలవులు రావడం కూడా ‘సైరా’కు బాగానే కలిసొచ్చింది. ఈ క్రమంలోనే 15 రోజులకు గానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.103.74 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా దక్కిన వసూళ్లను కూడా కలుపుకుంటే చిరు చిత్రానికి రూ.138.23 కోట్ల షేర్‌ దక్కినట్లు తెలుస్తోంది. అయితే నేటితో పాఠశాలలకు సెలవులు కూడా పూర్తయిపోతున్న నేపథ్యంలో ‘సైరా’ బ్రేక్‌ ఈవెన్‌ను టచ్‌ చేస్తుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ‘సైరా’ అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.200 కోట్లకు పైగా బిజినెస్‌ చేయగా.. ప్రస్తుతం ఈ మార్క్‌ను టచ్‌ చేయాలంటే మరో రూ.70 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రానికి దక్కుతున్న వసూళ్లను బట్టీ చూస్తుంటే లాంగ్‌ రన్‌లో మరో రూ.10 కోట్లకు పైన రాబట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలతో పోల్చితే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘సైరా’ వసూళ్లు నిరాశజనకంగా ఉండటంతో ఇంకో రూ.50 కోట్లు వసూళ్లు సాధించడం అసాధ్యంగానే కనిపిస్తోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.