‘వినయ విధేయ రామ’.. తొలి పాట వచ్చేసింది

‘రంగస్థలం’ చిత్రంతో మాస్‌ హీరోగా మరోసారి సత్తా చాటాడు రామ్‌చరణ్. ఈ సినిమా తర్వాత మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సినిమా అనగానే.. చెర్రీ మరింత ఊర మాస్‌ అయిపోతాడేమోనని అభిమానులంతా ఆశించారు. కానీ, బోయపాటి మాత్రం చరణ్‌ను ‘వినయ విధేయ రామ’గా మార్చేశారు. ఈసారి పూర్తి ఫ్యామిలీ డ్రామా కథతోనే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ హంగామాను రుచి చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. ఇందులో భాగంగా తాజాగా ‘‘తందానే తందానే..’’ అంటూ సాగే ఓ ఫ్యామిలీ గీతాన్ని బయటకొదిలింది చిత్ర బృందం. ఈ పాట చిత్రీకరణ ఎక్కువ భాగం సింహాచలం గుడి బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించగా.. ఎమ్‌.ఎల్‌.ఆర్‌ కార్తికేయన్‌ ఎంతో చక్కగా ఆలపించారు. పాట విజువల్స్‌లో చరణ్‌ కుటుంబం మొత్తాన్ని చూపించారు. ఇందులో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించబోతుండగా.. సీనియర్‌ హీరోలు ప్రశాంత్, ఆర్యన్‌ రాజేశ్, నటి స్నేహా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కైరా అడ్వాణి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
© Sitara 2018.
Powered by WinRace Technologies.