‘లక్ష్మీస్‌’ను అడ్డుకోలేం.. కానీ!!

‘‘రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో తమ పార్టీ నాయకుడిని ప్రతినాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం వల్ల తమ పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా విడుదలను నిలివేయా’’లని తెలుగు దేశం పార్టీ కార్యకర్త దేవీబాబు చౌదరి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై ఈసీ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది సినీ,రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ స్పందించారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర విడుదలను అడ్డుకోవడం కుదరదని, కానీ.. ఈ చిత్రం రిలీజైన తర్వాత అందులోని సన్నివేశాలు ఎవరికైనా అనుకూలంగా ఉన్నాయా? ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయా? ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించే రీతిలో ఉందా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోని అప్పుడు చర్యలు తీసుకొనే అవకాశముందని, ముందే ఎలాంటి చర్యలు తీసుకోవడం కుదరదని స్పష్టత ఇచ్చారు. మొత్తానికి ప్రస్తుతం రజత్‌ కుమార్‌ చెప్పిన దాన్ని బట్టీ చూస్తుంటే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనుకున్న తేదీకే రావడం ఖాయమనిస్తోంది. తాజాగా రజత్‌ కుమార్‌ చెప్పిన విషయాలను వర్మ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.