‘హలో గురు..’ లుక్కు చూడరో!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘రామ్‌ని కొత్త కోణంలో చూపే చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. జూన్‌ తొలివారంలో కాకినాడ, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. తర్వాత కొంత పార్ట్‌ను హైదరాబాద్‌లో షూట్‌ చేయడంతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్‌’ వంటి చిత్రాలతో వరుస విజయాలందుకున్న త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా ప్రేక్షకులందరినీ అలరించే చిత్రమవుతుందనడంలో సందేహం లేదు’’ అన్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మంగళవారం రామ్‌ పుట్టినరోజు. మాటలు: బెజవాడ ప్రసన్న కుమార్, కూర్పు: కార్తీక్‌ శ్రీనివాస్, ఛాయాగ్రహణం: విజయ్‌ కె.చక్రవర్తి.


© Sitara 2018.
Powered by WinRace Technologies.