హాలీవుడ్‌లో..

మంచు విష్ణు మూడు చిత్రాల్ని, ఒక వెబ్‌ సిరీస్‌ని ఒకే రోజు మొదలు పెట్టారు. అందులో ఆయన హీరోగా నటిస్తున్నవి రెండు చిత్రాలు కాగా, నిర్మాతగా మరో చిత్రం చేస్తున్నారు. విష్ణు నటిస్తున్న చిత్రాల్లో ఒకటి హాలీవుడ్‌లో రూపొందుతుండడం విశేషం. జెఫ్రెచిన్‌ దర్శకుడు. విష్ణు సరసన కాజల్‌ నటిస్తోంది. విష్ణు భార్య వెరోనికా మంచు నిర్మాత. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మరో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు కీలక పాత్ర పోషించనున్నారు. చిత్రీకరణ జరుగుతోంది. దీంతోపాటు మరో చిత్రంలో కూడా విష్ణు, కాజల్‌ కలిసి నటిస్తున్నారు. భారతదేశంలోని ఐటీ రంగం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రూ.2800 కోట్ల దోపిడీ ఎలా జరిగిందన్నదే ఈ సినిమాలో కీలకాంశం.

నిర్మాతగా ‘మిరా రోడ్‌’
మంచు విష్ణు నిర్మాణంలో ‘మిరా రోడ్‌’ అనే చిత్రం రూపొందుతోంది. సుబ్బరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిజ జీవిత సంఘటనలు ఆధారంగానే ఈ చిత్రం రూపొందుతోందని, స్టార్‌ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తారని సినిమా వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది చివరలో విడుదల చేయనున్నారు. దీంతో పాటు రాష్ట్ర విభజన జరగక ముందు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కనున్న వెబ్‌ సిరీస్‌ని నిర్మిస్తున్నారు విష్ణు. కథానాయకుడు శ్రీకాంత్‌ ఇందులో ప్రధాన పాత్రధారి. రాజ్‌ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ సంభాషణలు, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.