ఆసక్తికరంగా ‘మన్మథుడు 2’ టీజర్‌ పోస్టర్‌
* ఆసక్తికరంగా ‘మన్మథుడు 2’ టీజర్‌ పోస్టర్‌

‘వద్దురా.. సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా’ అంటూ హెచ్చరించి, యువకుల్ని జాగృతం చేసిన మన్మథుడి లీలల్ని మర్చిపోలేం. ఆ సినిమాలో నాగార్జున పాత్ర ప్రవర్తించిన తీరు, వేసిన సెటైర్లు... ఇప్పటికీ మర్చిపోలేం. సరిగ్గా అలాంటి వినోదాలే పంచడానికి నాగ్‌ మరోసారి రెడీ అయిపోయారు. నాగార్జున కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, కిరణ్‌ నిర్మాతలు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. గురువారం టీజర్‌ విడుదల చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రాన్ని వైవిధ్యంగా పేకాటలోని కింగ్‌ ముక్క రూపంలో రూపొందించడం విశేషం. ఇందులో నాగ్‌ కింగ్‌గా కనిపిస్తుండగా.. అందులో ఆయన ఓ వైపు వైన్‌ గ్లాస్‌తో, మరోవైపు కాఫీ గ్లాస్‌తో దర్శనమిస్తున్నాడు. ‘‘నాగ్‌ పాత్ర మరోసారి వినోదాలు పంచుతుంది. ‘మన్మథుడు’లానే కలకాలం గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్‌ పాత్రలూ బాగా వచ్చాయ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: చైతన్య భరద్వాజ్‌.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.