
‘‘సినిమా ఆడిందని ఆపేస్తామా? పోయిందని మానేస్తామా? మనకు తెలిసింది ఒకటే సినిమా.. సినిమా.. సినిమా..’’.. ఇది ‘నేనింతే’ చిత్రం కోసం పూరి జగన్నాథ్ రాసిన అద్భుతమైన సంభాషణ. ఇది కేవలం డైలాగ్ మాత్రమే కాదు. సినిమాపై తనకున్న పిచ్చికి, ఆరాధన భావానికి ప్రతీక. అందుకే కొన్నాళ్లుగా ఎన్ని ప్లాపుల్లో ఉన్నా వెండితెరపై తన సినిమాల సంఖ్యనైతే తగ్గించుకోలేదు. ఆ పోరాట స్ఫూర్తికి ఫలితంగానే ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చేశారు. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.80 కోట్ల వసూళ్లను దక్కించుకొంది. అయితే ఇప్పుడీ సినిమాపై వచ్చిన లాభంలో కొంత మొత్తాన్ని చిత్రసీమలో ఓ మంచి పని కోసం ఉపయోగించబోతున్నారు పూరి. ఎన్నో హిట్ చిత్రాలకు తమ వంతు సహాయ సహకారాల్ని అందించి.. నేడు ఆర్థికం ఇబ్బందులతో సతమతమవుతోన్న కొందరు అగ్ర దర్శకులు, సహాయ దర్శకులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు పూరి. దీనికోసం త్వరలోనే ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఓ 20 మంది దర్శకులకు, సహాయ దర్శకులకు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నారట. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను మీడియాతో పంచుకున్నారు పూరి. ఇది వారికి పెద్ద సహాయం కాకపోయినప్పటికీ చిరునవ్వులాంటి చిన్న పలకరింపుగా స్వీకరించండి అంటూ సహాయం అందుకోబోతున్న వాళ్లకు ఓ భావోద్వేగభరితమైన లేఖను రాశారు. అంతేకాదు దేవుడు తనకు జీవితాంతం ఇలాంటి శక్తిని ఇచ్చినట్లైతే.. ప్రతి ఏటా ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో ఆయన విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ‘ఫైటర్’ అనే చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు. దీన్ని ఛార్మితో కలిసి ఆయనే స్వయంగా నిర్మించనున్నారు.