మంచి చిత్రాన్ని ఇవ్వలేకపోయా
‘‘మీ అందరికీ వినోదం పంచే సినిమా అందించడానికి మేమంతా ఎంతో శ్రమించాం. కానీ, దురదృష్టవశాత్తు మేము అనుకున్నంత మంచి సినిమాను ఇవ్వలేకపోయాం’’ అన్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఆయన ఇటీవలే ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దారుణ ఫలితాన్ని అందుకొంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని ఉద్దేశిస్తూ చరణ్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు.. నా పట్ల మా సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాలకు వినయపూర్వక ధన్యవాదాలు. ‘వినయ విధేయ రామ’ కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. నిర్మాతకు.. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీ దారులు, ప్రదర్శనదారులకు కృతజ్ఞతలు. మీ అందరికీ వినోదం పంచే సినిమా అందించాలని మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకోని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. మీరు ఎల్లప్పుడూ చూపించే ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు’’ అని తన లేఖలో పేర్కొన్నారు రామ్‌చరణ్‌. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే డివైడ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.