గాయని చిత్ర సంగీత విభావరి

భారతీయ సినీ సంగీత ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కె.యస్‌.చిత్ర. 12 భారతీయ భాషల్లో దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా పాటలు పాడి.. తన సుస్వరాల జల్లుల్లో సంగీత ప్రేమికులను ఓలలాడించింది. దక్షిణాది గాన కోకిలగా కీర్తి గడించింది. ఇప్పుడీమె అనాథ ఆడపిల్లలకు అండగా నిలిచేందుకు హైదరాబాద్‌లో తన బృందంతో సంగీత విభావరి నిర్వహించబోతుంది. ‘కలర్స్‌ విత్‌ కె.యస్‌.చిత్ర’ పేరుతో ‘వి’ కేర్‌ స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. మార్చి 17న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ఈ సంగీత విభావరిని నిర్వహిస్తారు. దాదాపు మూడు గంటల పాటు కొనసాగనుంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్ర మాట్లాడుతూ ‘‘అనాథ ఆడపిల్లలకు అండగా నిలబడాలనే సదుద్దేశంతో ఈ గొప్ప కార్యానికి పూనుకున్నాం. దీనికి సంగీత ప్రియులంతా తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ విభావరిలో చిత్రతో పాటు యువ గాయకులు శ్రీకృష్ణ, శ్రీనిధి, సోని, సాకేత్‌లు పాల్గొననున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.