వెనక్కిమళ్లిన... ‘టాక్సీవాలా’!
‘పెళ్లిచూపులు’, ‘అర్జున్‌రెడ్డి’ వంటి హిట్‌ చిత్రాలతో యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ముఖ్యంగా ఈ యువ హీరోలోని వైవిధ్యమైన డైలాగ్‌ డెలివరీ, మాటల్లో ఉట్టిపడే సహజసిద్ధ తెలంగాణ యాస, నటనలోని తాజాదనం మొదలైవన్నీ విజయ్‌ను టాలీవుడ్‌లో ప్రత్యేకమైన కథానాయకుడిగా నిలబెట్టాయి. ముఖ్యంగా ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో కుర్రకారుకు మరింత చేరువయ్యాడు విజయ్‌. ఈ చిత్రంలో నేటి యువతరానికి ప్రతినిధిలా అర్జున్‌పాత్రలో విజయ్‌ ఒదిగిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విజయ్‌ తాజాగా ‘టాక్సీవాలా’ చిత్రంతో మరోసారి సందడి చేడానికి సిద్ధమయ్యాడు. గీతాఆర్ట్స్‌, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడీ సినిమా విడుదలను జూన్‌కు వాయిదా వేసింది చిత్ర బృందం. దీనికి సంబంధించి కొత్త విడుదల తేదీని ఈ వారంలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. విజయ్‌ ప్రధానపాత్రలో నటించిన ‘మహానటి’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి ఆదరణ దక్కించుకుంది. సావిత్రి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని అనే ఫొటో జర్నలిస్ట్‌గా చక్కటి నటన కనబరిచాడు. ప్రస్తుతం విజయ్‌ ‘నోటా’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘గీతా గోవిందం’ చిత్రాల్లో నటిస్తున్నాడు.© Sitara 2018.
Powered by WinRace Technologies.