ఈ ఏడాది తెలుగులో అత్యధికంగా థ్రిల్లర్ చిత్రాలు విజయవంతమయ్యాయి. అందులో హాస్యం ప్రధానంగా తెరకెక్కిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి. అనాథ శవాల చిక్కుముడుల కేసుని చేధించటానికి డిటెక్టివ్ ఆత్రేయ వేసే ఎత్తులు, ప్రతినాయకురాలు వేసే పైఎత్తులు, ఉత్కంఠభరితంగా సాగే కథనం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సంతానం ఆసక్తిగా ఉన్నారని సమాచారం. హాస్య నటుడిగా సినీ ప్రస్థానం మొదలు పెట్టిన సంతానం ఇప్పుడు కథానాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా హిందీలోకి కూడా తీసుకెళ్లే ఆలోచనలలో ఉన్నారట నిర్మాతలు.