తొలిసారి స్వరానికి పనిచెప్పింది!
                                

త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. ‘వెంకీ’, ‘దుబాయ్‌ శీను’ వంటి హిట్ల తర్వాత రవితేజ - శ్రీను వైట్ల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. రవితేజ త్రిపాతాభినయం చేసిన తొలి సినిమా ఇది. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ఇలియానా తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుండటం మరో విశేషం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం.. నవంబరు 16న తెరపైకి రానుంది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర సంగతులను తెలియజేశారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘‘వాస్తవానికి ఈ చిత్ర కథ రాసుకున్నప్పుడు ఇలియానానే నా మదిలో మెదిలింది. కానీ, తర్వాత వేరే వేరే హీరోయిన్లను పరిశీలించినా.. వారంతా ఈ పాత్రకు సరిపడరని అనిపించింది. అలా చివరకు ఇలియానాతోనే సినిమా చేశాం. ఆమె తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. అందుకే తొలిసారి తనతోనే తెలుగులో డబ్బింగ్‌ చెప్పించాం. డబ్బింగ్‌ సమయంలో పెద్ద పెద్ద డైలాగుల్ని సైతం ఇలియానా సింగిల్‌ టేక్‌లోనే చెప్పేయడం మమల్ని నిజంగా ఆశ్చర్యపరిచింది’’ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, శ్రీనివాస్‌ రెడ్డి, సునీల్‌ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.