నటి కంటే ముందు నేకొక అమ్మాయిని

‘‘తెరపై కనిపిస్తాను కాబట్టి సహజంగా నన్నంతా నటిగానే చూస్తుంటారు. కానీ నటన కాకుండా, ఇంకా చాలా కలలే కంటుంటా. వాటిని సాకారం చేసుకొనేందుకు కసరత్తులు కూడా చేస్తుంటా’’ అంటోంది అనుపమ పరమేశ్వరన్‌. ఆమె దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక. ఇటీవల ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకొంది. ‘‘నటి కంటే ముందు, నేనొక నవతరం అమ్మాయిని. ఒక పనికో, ఒక వ్యాపకానికో పరిమితం కావడం మాకు ఇష్టం ఉండదు కదా’’ అంటోంది అనుపమ. ‘‘ఒకే సమయంలో రెండు మూడు పనులు చేయడం ఇష్టం. చిన్ననాటి నుంచీ నాది అదే తీరు. చదువుకుంటూనే సినిమాల్లో నటించా. కానీ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదు. నటిగా కొనసాగుతున్నా ఇంకా చాలా విషయాలపైకి మనసు మళ్లుతుంటుంది. సెట్‌లో ఉన్నప్పుడు కూడా ఒక చోట కుదురుగా ఉండను. కెమెరా వెనకాల ఏం జరుగుతోంది, ఏ పని కోసం ఎవరెలా కష్ట పడుతున్నారో తెలుసుకుంటుంటా. ప్రస్తుతానికి నేను తరచూ కనే కల దర్శకత్వం గురించే. మిగిలిన కలలు గురించి తర్వాత చెబుతా’’ అని చెప్పింది అనుపమ.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.