మాస్‌ సినిమా కోసం క్లాస్‌ దర్శకుడు?

విక్టరీ వెంకటేష్‌ 75వ చిత్ర మైలురాయిని చేరుకోవడానికి రెండడుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నుంచి రాబోతున్న ‘వెంకీమామ’ 73వ చిత్రం కాగా తదుపరి తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో నటించబోయే సినిమా 74వదిగా రూపొందుతుంది. ఇది పూర్తయిన వెంటనే చేయబోయే ప్రతిష్ఠాత్మక 75 చిత్రాన్ని కూడా ఇప్పటికే ప్రకటించేశాడు. తాజాగా తమిళనాట అద్భుత విజయాన్ని అందుకున్న ధనుష్‌ ‘అసురన్‌’ని తెలుగులో వెంకటేష్‌ రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్‌ నుంచి అధికారిక ప్రకటన కూడా వెలువడిపోయింది. అయితే దీన్ని తెరకెక్కించబోయే దర్శకుడెవరన్నది ఇప్పటి వరకు తెలియజేయలేదు. ఇప్పటికే ‘అసురన్‌’ తెలుగు దర్శకుడు ఇతనే అంటూ ఓంకార్, హనురాఘవపూడి పేర్లు చాలా సార్లు వినిపించాయి. తాజాగా మరో క్లాస్‌ దర్శకుడిని ‘అసురన్‌’ కోసం ఎంపిక చేసినట్టు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అతనే శ్రీకాంత్‌ అడ్డాల. ఈ క్లాస్‌ దర్శకుడు ఇప్పటి వరకు ఒక్క మాస్‌ సినిమా కూడా తీయలేదు. మరి ‘అసురన్‌’ ఏమో ఊర మాస్‌ సినిమా. ఈ మాస్‌ మూవీ కోసం క్లాస్‌ దర్శకుడ్ని ఎంపిక చేశారా? లేదా? అనే అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. తెలుగు ‘అసురన్‌’ దర్శకుడి విషయం రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో దర్శకుడు పేరు అధికారికంగా తెలిసేది ఎప్పుడో అని ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.