ప్రముఖ నటుడు ‘కెప్టెన్’ రాజు (68) కన్నుమూశారు. సోమవారం ఉదయం కొచ్చిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. 1950లో కేరళలో జన్మించారు రాజు. 21వ యేట సైన్యంలో చేరారు. దాదాపు అయిదేళ్ల పాటు పనిచేశారు. ఆ తరవాత సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అందుకే ఆయన్ని ‘కెప్టెన్’ రాజు అని పిలుచుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సుమారు 500 చిత్రాల్లో వివిధ పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. అందులో మలయాళం చిత్రాలే దాదాపు 450 ఉన్నాయి. ఎక్కువగా ప్రతినాయకుడిగానే కనిపించారు. ‘రౌడీ అల్లుడు’, ‘శత్రువు’, ‘మాతో పెట్టుకోకు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’ చిత్రాలు ఆయనకు పేరు తీసుకొచ్చాయి. రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. కొన్ని ధారావాహికల్లోనూ మెరిశారు. జులైలో తొలిసారి ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచీ ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం కొచ్చిలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి.