చిరు ‘రైతు’ అవుతాడా!

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్ను చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఇది చిరు నటిస్తున్న 151వ చిత్రం. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా రూపొందుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ హాలీవుడ్‌ నిపుణుల సమక్షంలో చిత్ర క్లైమాక్స్‌కు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ సినిమా సెట్స్‌పై ఉండగానే.. చిరు 152వ సినిమాకు సంబంధించి ఆసక్తికర అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వరుస హిట్లతో దూసుకెళ్తున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ తెర వెనుక పనులను జºరుగా సాగిస్తున్నారట. కొరటాల కూడా చిరు కోసం స్క్రిప్ట్‌ను పగడ్బందీగా సిద్ధం చేస్తున్నాడట. శివ గత చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఓ సందేశాత్మక కథతో రూపొందనుందట. ఇందులో చిరు రైతు సమస్యలపై పోరాడే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కథకు తగ్గట్లుగానే ‘రైతు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ డిసెంబరు నాటికి చిరు ‘సైరా’ పనుల ముగించుకొని ఫ్రీ అయిపోతాడు కాబట్టి.. సంక్రాంతికి ఈ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించి, వేసవి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకువెళ్లాలని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. ఈ సినిమాను రామ్‌చరణ్‌ సొంత బ్యానర్‌పై మరో నిర్మాతను కలుపుకొని నిర్మిస్తారట. త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించనున్నారట.


© Sitara 2018.
Powered by WinRace Technologies.