ఫిదా చేస్తున్న ఆటో రాణి..
‘‘నే ఆటోదాన్ని.. ఆటోదాన్ని అన్నగారి రూటు దాన్ని’’.. అంటూ ఆటోడ్రైవర్‌గా దూసుకొచ్చింది సాయిపల్లవి. ఈ ఫిదా భామ ఇప్పుడిలా ఆటోడ్రైవర్‌గా మారింది మరెందుకో కాదు.. తాను కథానాయికగా నటిస్తున్న ‘మారి 2’ కోసమే. ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రమిది. బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ధనుష్‌ - కాజల్‌ జంటగా నటించిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో సాయి పల్లవి ఆటోడ్రైవర్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఆటో నడపడంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను బయటకొదిలింది చిత్ర బృందం. ఈ ప్రచార చిత్రంలో సాయి పల్లవి ఖాకీ చొక్కా వేసుకొని మగరాయుడులా ఊర మాస్‌లుక్‌తో ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ‘‘ఆనంది ఆరతు ఆనంది’’.. అంటూ విడుదలైన ఈ లుక్‌ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాయి పల్లవి - ధనుష్‌లకు తెలుగులో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ సినిమాను తెలుగులోకి విడుదల చేసే అవకాశముంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబరులో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.