వాటి అన్వేషణలో కాలాన్ని వృథా చేసుకోలేం

విజయం సాధించాలన్నా.. ఆ విజయంతో దక్కిన స్థానాన్ని ఎప్పటికప్పుడు నిలబెట్టుకోవాలన్నా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా నటీనటుల కథల ఎంపిక కూడా మారుతూ ఉండాల్సిందే. జయాపజయాలే తమ కెరీర్‌కు కొలమానంగా భావించే కథా నాయికలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం సినీప్రియులంతా కొత్త రుచులనే కోరుకుంటున్నారు. ఫలితం ఎలా ఉంటుందన్నది పక్కన పెట్టి నాయికలు కూడా ప్రయోగాత్మక చిత్రాలకు సై అనక తప్పట్లేదు. ప్రస్తుతం అందాల చందమామ కాజల్‌ కూడా ఈ బాటలోనే నడుస్తూ సత్తా చాటుతోంది. ‘అ!’తో అలాంటి ప్రయాణానికి శ్రీకారం చుట్టిన ఈమె.. ‘సీత’తో దాన్ని కొనసాగించింది. అయితే ప్రయోగాత్మక కథలతో చేసే ప్రయాణం కాస్త సవాల్‌తో కూడినదే అంటోంది కాజల్‌. ‘‘ఓ కొత్త తరహా చిత్రాన్ని చూస్తే మనకీ అలాంటి కథ దొరికితే బాగుండు అనిపిస్తుంది. కానీ వాటి అన్వేషణలోనే కాలాన్ని వృథా చేసుకోలేం. ఒకవేళ పనిగట్టుకొని మనం అలాంటి కథలు రాయించుకున్నా వాటిలో సహజత్వం దొరకడం కష్టం. ఏ కథైనా సహజంగా పుట్టాలి.సహజంగా దగ్గరకు రావాలి. అలా వచ్చినప్పుడు ఫలితమెలా ఉన్నా ఆత్మ సంతృప్తి తప్పక దొరుకుతుంది’’ అని చెప్పింది కాజల్‌. ప్రస్తుతం ఈ భామ శంకర్‌ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’తో పాటు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమైంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.