అల్లూరిగా మహేష్‌ను ఎందుకు తీసుకోలేదంటే..
‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలతో దేశవ్యాప్తంగా తన సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో.. దానికి తగ్గట్లుగానే రామ్‌చరణ్‌ - ఎన్టీఆర్‌ వంటి స్టార్లతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ను పట్టాలెక్కించి అందరి దృష్టినీ ఆకర్షించాడు రాజమౌళి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ చిత్రీకరణ పూర్తవగా.. త్వరలోనే కోల్‌కతాలో మూడో షెడ్యూల్‌ను షురూ చేయబోతున్నాడు. తాజాగా నిర్వహించిన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ప్రెస్‌మీట్‌లో చిత్ర కథ ఏంటి? ఎవరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి వంటి అంశాలపై పూర్తి క్లారిటీ కూడా ఇచ్చేశాడు జక్కన్న. ఈ చిత్రంలో చరణ్‌ యువ అల్లూరి సీతారామ రాజుగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రెస్‌మీట్లో రాజమౌళి ఈ విషయాన్ని ప్రకటించగానే.. మీడియా నుంచి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘అల్లూరి పాత్రను మహేష్‌తో చేయిస్తే బాగుండేది కదా.. ఎలాగూ ఆయన తండ్రి కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రం చేసి విజయం సాధించారు. కాబట్టి ఈ పాత్రకు ప్రిన్స్‌ను పెట్టి ఉంటే ఆయన అభిమానులు ఎంతో ఆనందపడేవారు కదా’’ అని ప్రశ్నించారు. అయితే దీనికి దర్శకధీరుడు ఓ ఆసక్తికరమైన జవాబిచ్చాడు. ‘‘ఓసారి ఏదో కార్యక్రమంలో నేను మహేష్‌ అభిమానుల్ని కలవగా.. ‘మీరు ప్రిన్స్‌ని అల్లూరిగా చూడాలనుకుంటున్నారా? లేక జేమ్స్‌ బాండ్‌గా పాత్రలోనా?’ అని అడగ్గా వారు అల్లూరి కన్నా జేమ్స్‌ బాండ్‌ తరహా పాత్రలోనే చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. అందుకే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోకి మహేష్‌ను తీసుకోలేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా జక్కన్న నిజంగా మహేష్‌ను తీసుకోవాలనుకున్నాడో లేదో కానీ, ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఏదైనా బాండ్‌ తరహా కథలొస్తే అది మహేష్‌తోనే చేస్తాడని తెలుస్తోంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.