మరో మల్టీస్టారర్‌తో వస్తున్న మణిరత్నం

ల్టీస్టారర్‌ సినిమాలను రూపొందించడంలో మేటి దర్శకుడు మణిరత్నం. గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్‌ మూవీ ‘దళపతి’లో రజనీకాంత్, మమ్ముట్టి, అరవిందస్వామిలు నటించారు. అప్పట్లో ఇది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవల తమిళంలో రూపొందించిన మరో మల్టీస్టారర్‌ ‘సెక్క సివందవానం’తో విజయాన్నందుకొన్నారు. అరవిందస్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్‌లు నటించారు. ప్రస్తుతం ‘పొన్నియన్‌ సెల్వన్‌ ’ అనే చిత్రాన్ని మణిరత్నం రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌ చిత్ర రంగాలకు చెందిన కథానాయకులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్, మహేశ్‌బాబు, ఐశ్వర్యరాయ్‌ వంటి నటీనటులతో రూపొందించాలనే ప్రయత్నం అప్పట్లో జరిగిందట కానీ వివిధ కారణాల వల్ల కుదరలేదు. అదే కథను ఇప్పుడు విక్రమ్, విజయ్‌సేతుపతి, జయంరవి, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యారాయ్, టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు తారాగణంగా రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతోంది. చిత్రవివరాలను అధికారికంగా త్వరలో ప్రకటిస్తారట. తమిళ కథానాయకుడు కార్తి కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో కనిపిస్తారట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.