‘ఎన్టీఆర్‌’కు శ్రీదేవి సంతకం చేయలేదట!

మహానటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఆయన తనయుడు, నటుడు బాలకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలయ్య టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్‌ కనిపించబోతుండగా.. శ్రీదేవి పాత్ర కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఎంపిక చేసుకున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై రకుల్‌ తాజాగా నోరు విప్పింది. శ్రీదేవి పాత్రకు తనను అడిగిన మాట వాస్తవమే కానీ, ఇంత వరకు ఈ సినిమాకు సంతకం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ‘‘ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో క్షణం తీరిక లేదు. షూటింగ్‌లతో బిజీ బిజీ. అవి పూర్తి చేసుకోని హైదరాబాద్‌ వచ్చాక కథ వింటా. శ్రీదేవికి నేను పెద్ద అభిమానిని. ఆమె అంటే ఎంతో గౌరవం. ‘ఎన్టీఆర్‌’లో శ్రీదేవి పాత్ర పోషించడం నాకు పెద్ద సవాలే. ఆవిడ పాత్రకు న్యాయం చేయగలనని నాపై ఉన్న నమ్మకంతో నన్ను సంప్రదించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. సినిమాకు సంతకం చేశాక.. అధికారికంగా ప్రకటిస్తా’’ అని రకుల్‌ తెలియజేసింది. మొత్తానికి ఆమె చెప్పిన దాని బట్టీ శ్రీదేవి పాత్ర చేయడానికి ఆమె సిద్ధంగానే ఉన్నట్లు అర్థమైంది.


© Sitara 2018.
Powered by WinRace Technologies.