విడుదలకు ముందే ‘‘నో రోమాన్స్, నో హీరోయిన్, ఓన్లీ యాక్షన్’’ అంటూ ప్రేక్షకులకు తన ‘ఖైదీ’ గురించి చెప్పాడు కథానాయకుడు కార్తి. ‘ఖాకీ’ తరువాత కార్తి నటించిన వైవిధ్యమైన యాక్షన్ చిత్రం ఇది. పది సంవత్సరాలు శిక్ష అనుభవించి విడుదలైన ఒక ఖైదీ తన కూతురిని కలుసుకోవటానికి బయలుదేరుతాడు. కాని అనుకోకుండా పోలీస్ అధికారులకు అతని సహాయం అవసరం అవుతుంది. అతను చేసే సహాయంపై పోలీస్ అధికారుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. ఆ రాత్రి ఈ ఖైదీ వాళ్లని ఎలా కపాడాడు, తన కూతురిని ఎలా కలుసుకున్నాడు అన్నదే ఈ సినిమా కథనం. దీపావళి కానుకగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒకేసారి పలకరించిందిది. విడుదలకు ముందు వరకు ఇటువంటి ఉత్కంఠభరితమైన యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకులు స్వీకరిస్తారో అని భయపడింది చిత్ర బృందం. ఇప్పుడు ఇది కార్తి సినీ జీవితంలో 100 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసిన మొదటి సినిమాగా నిలిచిందని సమాచారం. ‘ఖైదీ’పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.