మహేష్‌ను పూరి అలా అనేశాడేంటి!!
సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు - పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీప్రియుల్లో ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’, బాక్సాఫీస్‌ ముందు సూపర్‌డూపర్‌ హిట్లుగా నిలిచాయి. కలెక్షన్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే మహేష్‌ అభిమానులు, సినీప్రియులు వీరిద్దరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రాన్ని ఆశించారు. దీనికి తగ్గట్లుగానే పూరి కూడా ‘జనగనమణ’ పేరుతో ఓ స్ర్కిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. కానీ, అదెందుకో పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూరికి మహేష్‌తో సినిమాపై ఓ ప్రశ్న ఎదురైంది. సూపర్‌స్టార్‌తో హ్యాట్రిక్‌ చిత్రం ఎప్పుడనేది చెప్తూ ఆయనపై ఆసక్తికరమైన కామెంట్స్‌ చేశాడు పూరి. ‘‘మహేష్‌తో రెండు హిట్లు తీశాననే ప్రేమతో ఆయన అభిమానులు మరో సినిమా చేయమని అడుగుతుంటారు. వాస్తవానికి నాకు మహేష్‌ కన్నా ఆయన అభిమానులంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే వాళ్ల కోసం చెప్తున్నా.. నేను హిట్లలో ఉంటేనే ఆయన నాతో సినిమా చేస్తారు’’ అని షాకింగ్‌ కామెంట్‌ చేశాడు. ఇప్పుడిది ఇటు ఫిలిం నగర్‌లో అటు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.


ఎందుకంటే.. పూరికి మహేష్‌ అవకాశమిచ్చిన ప్రతిసారి ఆయన వరుస ప్లాపుల్లోనే ఉన్నారు. ‘పోకిరి’కి ముందు పూరి తీసిన ‘ఆంధ్రావాలా’, ‘143’, ‘సూపర్‌’ పరాజయం పాలవగా.. ‘బిజినెస్‌మెన్‌’కు ముందు ‘ఏక్‌ నిరంజన్‌’, ‘గోలీమార్‌’, ‘నేను నా రాక్షసి’ వంటి హ్యాట్రిక్‌ ప్లాప్‌లు పడ్డాయి. కానీ, ఇవేమి పట్టించుకోకుండా మహేష్‌ పూరికి ఆఫర్లిచ్చాడు. కానీ, ఇప్పుడు వీటినేం ఆలోచించకుండా మహేష్‌పై పూరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన అభిమానులకు మింగుడు పడటం లేదు.
సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.