అనుకున్నది ఒకటి.. అవుతోంది మరొకటి!!

‘గరుడవేగ’, ‘కల్కి’ వంటి హిట్లతో ఫుల్‌ జోష్‌లోకి వచ్చారు సీనియర్‌ హీరో రాజశేఖర్‌. ఇప్పుడీ జోరులోనే తన తర్వాతి చిత్రానికి సిద్ధమవుతున్నారు ఈ యాంగ్రీస్టార్‌. కొన్నాళ్ల నుంచి ఆయన ‘కవుల్దారి’ అనే కన్నడ హిట్‌ రీమేక్‌లో నటించబోతున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్‌ ఆంటోనితో ‘బేతాళుడు’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్‌ కృష్ణమూర్తి దీనికి దర్శకత్వం వహించబోతున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడీ థ్రిల్లర్‌ను రాజశేఖర్‌ పక్కకు పెట్టేశారట. మరో విశేషం ఏంటంటే.. ఇప్పుడీ రీమేక్‌ను అక్కినేని హీరో సుమంత్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్టు స్థానంలోనే మరో థ్రిల్లర్‌ను ఖరారు చేసుకునే పనిలో ఉన్నారట రాజశేఖర్‌. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను సీనియర్‌ దర్శకుడు వీరభద్రం చౌదరికి అప్పగించారట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట వీరభద్రం. నవంబరు నుంచి సెట్స్‌పైకి వెళ్లబోయే ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది ద్వితియార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.