రజనీ నుంచి మరో సినిమా?

ఎప్పుడెప్పుడా రజనీ రాజకీయ రంగ ప్రవేశం అని ఎదురు చూశారు తమిళ తంబీలు. సూపర్‌ స్టార్‌ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని, కొత్త పార్టీ పెడతానని చెప్పారు. అప్పటి నుంచి ‘తలైవా’ ఇక సినిమాలు చేస్తాడా అన్న సందేహం ప్రేక్షకుల్ని కలవరపెట్టింది. అభిమానుల అంచనాలకు అందకుండా ‘పేట’, ‘దర్బార్‌’ చిత్రాలు వెంట వెంటనే ప్రకటించి, నటించారు రజనీ. ఈ మధ్యనే దర్బార్‌ సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇక రాజకీయాల మీద దృష్టి పెడతారా లేక మళ్ళీ కొత్త సినిమా ప్రకటిస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇది ఇలా ఉంటే గతంలో శివ రజనీకి స్క్రిప్టు వినిపించగా అందులో కొన్ని మార్పులు చేయమని రజనీ సూచించారట. ఈ మేరకు శివ ఇప్పడు మళ్లీ స్క్రిప్టును మార్చి వినిపించినట్లు తెలుస్తోంది. శివ చెప్పిన కథ నచ్చడంతో రజనీ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపారని కోలీవుడ్‌ టాక్‌. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.