ఒకే నెలలో రజనీ ఫ్యాన్స్‌కు 2 పండగలు?

ఈ ఏడాది డిసెంబరులో రజనీకాంత్‌ అభిమానులు రెండు పండగలు జరుపుకోబోతున్నారు. వాళ్లకు మాత్రమే ఉన్న ఆ పండగలేంటి అని ఆలోచిస్తున్నారా? ఒకటి అందరికీ తెలిసిందే. అదే రజనీ పుట్టిన రోజు. డిసెంబరు 12 ఆయన అభిమానులకు పండగే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి ముందే ఆయన అభిమానులు మరొక ఉత్సవం జరుపుకోబోతున్నారని కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఆ రెండో పండగ ఏంటంటే.. ‘దర్బార్‌’ చిత్ర ముందస్తు విడుదల(ఆడియో విడుదల) కార్యక్రమం. రజనీ నటించిన చిత్రాల విషయంలో ఏ కార్యక్రమమైనా ఆయన అభిమానులకు పండగే కదా! రజనీ పుట్టిన రోజు కంటే 5 రోజుల ముందు డిసెంబరు 7న ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయని సినీ వర్గాల టాక్‌. అధిక సంఖ్యలో సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.