ఈ ట్వీట్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వాయిదాకు సంకేతమా??

ఎం
తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రానికి సంబంధించి అనేక విషయాలపై స్పష్టత వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియో మోరిస్‌ నటిస్తోందని.. ప్రతినాయకులుగానూ ఆంగ్ల నటులు రే స్టీవెన్‌సన్‌, ఎలీసన్‌ డూడీలను కనిపించబోతున్నారని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో చిత్రీకరణపై ఉన్న అనుమానాలను తొలగించారు. ఇప్పటికే 70శాతం షూట్‌ పూర్తయినట్లు తెలిపారు. కానీ, విడుదల తేదీ మారుతోందంటూ కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై మాత్రం చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని 30 జులై 2020లో విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనికి ఎలాగూ మరో ఎనిమిది నెలల సమయం ఉంది కాబట్టి ఈలోపు మిగిలిన చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేయడం పెద్ద విషయం కాదు. కానీ, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని ఏకంగా పది భాషల్లో విడుదల చేయబోతున్నారని, 2020లోనే ఇది ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలియజేశారు. ఇప్పటికే రిలీజ్‌ డేట్‌ చెప్పేసినా తరణ్‌ తన ట్వీట్‌లో ఆ తేదీని ప్రకటించకపోవడానికి కారణం ఏంటి అన్న చర్చ మొదలైంది. ఎలాగూ ఈ చిత్రాన్ని పది భాషల్లో విడుదల చేయబోతున్నారు కాబట్టి నిర్మాణాంతర కార్యక్రమాలు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు ఇన్ని భాషల్లో విడుదల అంటే ప్రచార కార్యక్రమాలూ పెద్ద సవాలే. దానికి మరింత సమయం కావాలి. అందుకే ముందుగా అనుకున్న తేదీకి కాకుండా దసరా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మేలని చిత్ర బృందం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసే తరణ్‌ కూడా తన ట్వీట్‌లో విడుదల తేదీని ప్రకటించలేదని అర్థమవుతోంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.