‘మహా సముద్రం’లో మాస్‌రాజాతో లవర్‌బాయ్‌!!

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సత్తా చాటారు అజయ్‌ భూపతి. ఇప్పుడీయన ‘మహా సముద్రం’ పేరుతో రెండో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. కథానాయకుడిగా రవితేజ సందడి చేయబోతున్నాడు. ఆయనకు జోడీగా అదితి రావు హైదరీని ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. చిత్ర కథ ప్రకారం ఇందులో మరో కథానాయకుడికి ఛాన్స్‌ ఉందట. ఇప్పుడీ పాత్ర కోసం సిద్ధార్థ్‌ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్‌ తొలినాళ్లలో లవర్‌బాయ్‌గా ‘బాయ్స్‌’, ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి హిట్లను ఖాతాలో వేసుకున్న సిద్ధార్థ.. ఆ తర్వాత సరైన హిట్లు లేక టాలీవుడ్‌కు దూరమయ్యాడు. ఈ యువ హీరో చివరిగా తమిళ డబ్బింగ్‌ చిత్రం ‘గృహం’తో ప్రేక్షకుల్ని పలకరించాడు. అయితే ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత ఓ చక్కటి పాత్రతో తిరిగి తెలుగు తెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాడట. వాస్తవానికి దీనికన్నా ముందు నాని ‘గ్యాంగ్‌లీడర్‌’లోనే సిద్ధార్థ్‌ నటించబోతున్నట్లు వార్తలొచ్చినప్పటికీ.. చివరకు ఆ పాత్రను ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ కొట్టేశాడు. అప్పుడా ఛాన్స్‌ మిస్‌ అయినా.. ఇప్పుడు రవితేజ వంటి స్టార్‌ హీరోతో కలిసి తెర పంచుకోనుండటంతో అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. వైజాగ్‌ నేపథ్యంతో సాగే ఓ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. దీనికి జెమిని కిరణ్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. అక్టోబరు నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.