‘సైరా’ మరోసారి వాయిదా పడనుందా?

రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీలు వాయిదాల మీద వాయిదా పడుతున్నాయి. చిత్రం ప్రారంభించినప్పుడు విడుదల తేదీని ఆగస్టు 15 ఖరారు చేశారు. తరువాత సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వల్ల చిత్రాన్ని అక్టోబర్‌ 2కు పొడగించారు. ఇప్పుడు మళ్లీ చిరు అభిమానులను నిరాశపరిచే మరో చేదువార్త బయటకు వస్తుంది. అదేమంటే ‘సైరా’ సినిమా ఏకంగా 2020, జనవరి మాసంలో విడుదల కానుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, విజయ్‌సేతుపతి, కిచ్చా సుదీప్‌లు నటిస్తున్నారు. ప్రధాన కథానాయికగా నయనతార నటిస్తున్నారు. బాలీవుడ్‌కి చెందిన అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ‘సైరా’ ఇలా వాయిదాల మీద వాయిదాలతో జాప్యం జరుగుతుంటే మెగా అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.