పవన్‌ కథలోకి వెంకీని తెచ్చాడు!
గురు’ వంటి హిట్‌ తర్వాత దాదాపు ఏడాది విరామం తీసుకున్న విక్టరీ వెంకటేశ్‌.. ఇప్పుడు నెమ్మదిగా జోరు పెంచుతున్నారు. ఇప్పటికే రెండు మల్టీస్టారర్లతో బిజీగా ఉన్న వెంకీ తాజాగా మరో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపాడని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయనున్నది కావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి వెంకటేష్‌పై పడింది. ప్రస్తుతం వెంకీ యువ హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌2’ అనే మల్టీస్టారర్‌ చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే మరో మల్టీస్టారర్‌ చేయనున్నాడు. ఇంకా ఈ చిత్రం పట్టాలెక్కక ముందే తాజాగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పడట వెంకీ. ‘అజ్ఞాతవాసి’ తర్వాత త్రివిక్రమ్‌.. పవన్‌తో ఓ సినిమా చేయాలనుకున్నాడు. ఆ స్టోరీ లైన్‌కు అప్పట్లోనే పవన్‌ ఓకే చెప్పాడు కూడా. కానీ, ఆ తర్వాత పవన్‌ పూర్తిగా రాజకీయాలకే పరిమితమవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడీ కథనే త్రివిక్రమ్‌.. వెంకీకి వినిపించగా ఆయన కూడా సినిమా చేసేందుకు సరే అన్నాడని వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో త్రివిక్రమ్‌ - వెంకీల కలయికలో ‘నువ్వునాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్‌ రచయితగా పనిచేశారు. ఈ మాటల మాంత్రికుడు ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలసి ‘అరవింద సమేత’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.