ఇది శీనుగాడి ‘జ్వాల’

విజయ్‌ ఆంటోని అంటే తెలుగు ప్రేక్షకులకి తొందరగా అర్థం కాదు. కానీ ‘బిచ్చగాడు ’ హీరో విజయ్‌ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. పేరుకు తమిళ నటుడైన అయినా అక్కడ నటించే అతని సినిమాలన్నీ తెలుగులో అనువాదమై అలరిస్తుంటాయి. అలా వచ్చిన వాటిల్లో ‘భేతాళుడు’, ‘రోషగాడు, ‘కాశి’లాంటి చిత్రాలు ఉన్నాయి. అలా ప్రస్తుతం తమిళంలో ‘అగ్ని సిరగుల్‌’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పుడే ఇదే సినిమాని తెలుగులో ‘జ్వాల’గా తీసుకురానున్నారు. సినిమాకి ‘జ్వాల’ అనే పేరును ఖరారు చేస్తూ తెలుగులో ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవీన్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో కమల్‌హాసన్‌ రెండో కూతురు అక్షర హాసన్‌ కథానాయికగా నటిస్తోంది. చిత్రంలో విజయ్‌ శీను అనే పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలోని కొన్ని సన్నివేశాలను విదేశాలైన మాస్కో, రష్యా, కజకిస్థాన్‌లాంటి ప్రాంతాల్లో తెరకెక్కించారట. యాక్షన్‌ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్, జవ్వాజి రామాంజనేయులు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఇందులో కీలక పాత్రల్లో ప్రకాష్‌ రాజ్, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. నటరాజన్‌ శంకరన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.