తెలుగు స్టార్లకు రౌడీ హీరో షాక్‌!

‘పెళ్లి చూపులు’తో ఓ నిశ్శబ్ద విప్లవంలా మొదలైన విజయ్‌ దేవరకొండ క్రేజ్‌.. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా శిఖర స్థాయికి చేరింది. ఇక గతేడాది ‘మహానటి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి హిట్లతో యువతరంలోనే కాక కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఇటీవలే ఫోర్బ్స్‌ 30 - 30 జాబితాలోనూ చోటు దక్కించుకోని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడీ రౌడీ హీరో మరోసారి తన క్రేజ్‌ను సినీ ప్రియులకు రుచి చూపించాడు. తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌ వారు నిర్వహించిన ‘హైదరాబాద్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ లిస్ట్‌ 2018’లో తొలి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలుగు నాట అగ్ర హీరోలుగా కొనసాగుతున్న మహేష్‌ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్‌ వంటి వారిని దాటుకొని విజయ్‌ మొదటి స్థానంలో నిలవడం ఓ విశేషమనే చెప్పాలి. గతేడాది ఇదే జాబితాలో దేవరకొండ రెండో స్థానంలో నిలవగా.. ఇప్పుడు తొలిస్థానానికి ఎగబాకాడు. ఆ మధ్య చెన్నై టైమ్స్‌ కూడా ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ లిస్టు 2018’ జాబితాను విడుదల చేయగా.. అక్కడ రౌడీ హీరో 3వ స్థానంలో నిలిచి తమిళ స్టార్లకు షాకిచ్చాడు. మొత్తానికి దక్షిణాది మొత్తం రౌడీ హీరో క్రేజే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ యువ హీరో భరత్‌ కమ్మ దర్శకత్వంలో ‘డియర్‌ కామ్రేడ్‌’లో నటిస్తోనే.. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. వీటి తర్వాత మైత్రీ మూవీస్‌ సంస్థలో ఓ బహుభాషా చిత్రాన్ని షురూ చేయనున్నాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.