ఎన్టీఆర్‌ వద్దన్నది విజయ్‌ చేస్తున్నాడా?

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండతో దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. టైటిల్‌ చూస్తుంటే ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కథను పూరి ముందుగా జూనియర్‌ ఎన్టీఆర్‌కు వినిపించాడట. దీనిపై అంతగా ఆసక్తి చూపని ఎన్టీఆర్‌ సున్నితంగా తిరస్కరించాడని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో కథలో కొన్ని మార్పులు చేసి విజయ్‌ దేవరకొండకు చెప్పడంతో వెంటనే ఓకే చేశాడట విజయ్‌. పూరి రాసుకున్న ఎన్నో కథలు ఒక హీరో కాదంటే మరో హీరో చేసి బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే జాబితాలో చేరుతుందంటున్నారు అభిమానులు. నవంబరులో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. పూరి టూరింగ్‌ టాకీస్, పూరి కనెక్ట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. కథానాయిక ఇంకా ఖరారు కాలేదు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.