‘యాత్ర’ టీమ్‌ తీసుకున్న గొప్ప నిర్ణయం

శుక్రవారం విడుదలైన చిత్రాల్లో ‘యాత్ర’ ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించింది. మమ్ముట్టి ప్రధాన పాత్రధారి. మహి. వి.రాఘవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రబృందం ఇప్పుడో గొప్ప నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలలో 5 శాతం రైతుల సంక్షేమం కోసం కేటాయించబోతున్నారు. ‘యాత్ర’లో కొన్ని సన్నివేశాలు రైతు దీన స్థితిని అద్దం పట్టాయి. రైతే రాజు అనిపించుకోవడం కాదు, మామూలు మనిషిగానూ రైతుని గుర్తించడం లేదన్న ఆవేదన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల ద్వారా చూపించారు. అందుకే ఇప్పుడు రైతు సంక్షేమం కోసం చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుంది. తొలి రోజు ఈ చిత్రానికి రూ.2.5 కోట్ల వరకూ వసూళ్లు వచ్చాయి. శని, ఆదివారాలూ ఈ జోరు కొనసాగే అవకాశాలున్నాయి.


* ‘యాత్ర’పై స్పందించిన జగన్‌

 ‘యాత్ర’ సినిమాపై వైకాపా అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రశంసలు కురిపించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌ అందుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవ్‌, నిర్మాత విజయ్‌ చిల్లా.. జగన్‌ను కలిశారు. సినిమా గురించి చర్చించారు. ఈ సందర్భంగా సినిమాపై తన అభిప్రాయాలను జగన్‌ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘‘యాత్ర’ సినిమాను విజయవంతంగా విడుదల చేసినందుకు చిత్రబృందానికి అభినందనలు‌. గొప్ప నాయకుడైన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రను సినిమాలో ఎంతో నిబద్ధతతో చూపించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని పేర్కొన్నారు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.