ఓవైపు నవ్వులు.. మరోవైపు ఉత్కంఠ!
న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`. ఆర్‌.ఎస్‌.జె స్వరూప్‌ దర్శకత్వం వహించారు. ఇటీవలే సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను అందుకుంది. దీన్ని జూన్ 21న విడుద‌ల చేయబోతున్నారు. ఇక తాజాగా యువ హీరో విజయ్‌ దేవరకొండ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. న‌వీన్ ఇందులో డిటెక్టివ్ పాత్ర‌ధారిగా న‌టించారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీ ఇది. దీనికి తగ్గట్లుగానే చిత్ర ట్రైలర్‌ను కట్‌ చేశారు. చిన్న చిన్న కేసులు డీల్‌ చేసే ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ (నవీన్‌)కు ఓ పెద్ద సవాలు ఎదురవుతుంది. ఓ అమ్మాయి హత్య కేసును ఛేదించే నేపథ్యంలో నిర్ఘాంతపోయే విషయాలు తెలుస్తాయి. ‘‘ఆ రోజు ఒంగోలులో ఏదో జరిగింది..?’’ అంటూ హీరో అనుమానం వ్యక్తం చేస్తూ కనిపించారు. చివరిలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న పుస్తకాన్ని పోలీసు అధికారికి అమ్మే తీరు నవ్వులు పంచుతోంది. ట్రైలర్‌ ఆద్యంతం నవీన్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. సినిమా కూడా ఇదే కోవలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. మార్క్ కె.రాబిన్ స్వరాలు సమకూర్చారు. స‌న్నీ కూర‌పాటి నిమాటోగ్ర‌ఫీ అందించారు. ‘మ‌ళ్ళీరావా’ వంటి హిట్‌ను అందించిన రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.