ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘ఎవరు’ ట్రైలర్‌

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఆసక్తిరేకెత్తించే థ్రిల్లర్‌ కథలకు చిరునామాగా నిలుస్తున్నారు అడవి శేష్. గతేడాది ‘గూఢచారి’గా ప్రేక్షకులను మెప్పించిన ఈ యువ హీరో.. ఇప్పుడు ‘ఎవరు’ అంటూ మరోసారి థ్రిల్‌ చేయబోతున్నాడు. వెంకట్‌ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. రెజీనా, నవీన్‌ చంద్ర కీలక ప్రధాన పాత్రల్లో నటించారు. పీవీపి సంస్థ నిర్మించింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెజీనాపై నవీన్‌ చంద్ర అత్యాచారానికి ప్రయత్నించడం.. అతన్ని ఆమె దారుణంగా హత్య చేయడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తికరంగా మొదలైంది. ఓవైపు తనపై హత్య కేసు నమోదై ఉండగా.. రెజీనా మాత్రం తనని రేప్‌ చేయడానికి ప్రయత్నించాడంటూ పోలీసులను ఆశ్రయిస్తుంది. ఈ మధ్యలోనే ఓ యువకుడు తన తండ్రి మూడు రోజుల నుంచి కనపడటం లేదంటూ అడవి శేష్‌కు ఫిర్యాదు చేస్తాడు. మరి ఈ మిస్సింగ్‌ కేసుకు ఆ హత్యకు సంబంధం ఏమిటి? రెజీనా నవీన్‌ను హత్యచేయడం వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా? అన్నది మిగతా చిత్ర కథాంశం. ట్రైలర్‌లో వినిపించిన శ్రీచరణ్‌ పాకాల నేపథ్య సంగీతం హైలైట్‌గా ఉంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.