నవ్వులు పూయిస్తున్న ‘ఎఫ్‌2’ ట్రైలర్‌..

వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ తోడల్లుళ్లుగా ‘ఎఫ్‌2’ చిత్రంతో సంక్రాంతికి వినోదాల విందును వడ్డించబోతున్నారు. భార్యా బాధితులుగా వారిద్దరి ఫన్‌ ఫ్రస్టేషన్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతుంది. మరి అది ఏ స్థాయిలో ఉండబోతుంది తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. వెంకీకి జోడీగా తమన్నా.. వరుణ్‌ సరసన మెహరీన్‌ ఆడిపాడబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార వీడియో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. ‘‘చివరిగా నవ్వుకొని తాళికట్టు నాయనా..’’ అని పూజారి అనడంతో పెళ్లి పీటలపై కూర్చొని ఉన్న వెంకటేష్‌ షాక్‌ అవడంతో ట్రైలర్‌ ఫన్నీగా మొదలైంది. భార్యపై కోపంతో చిటపటలాడే భర్తగా వెంకీ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్‌ హైలెట్‌గా నిలిచింది. వరుణ్‌.. మెహరీన్‌ను తన బుట్టలోకి దింపేందుకు కష్టపడుతూ కనిపించాడు. ఓ సన్నివేశంలో వరుణ్‌ ‘‘మజాక్‌ చేస్తున్నావా?’’ అని వెంకీని అడగ్గా.. ‘‘నువ్వేమన్నా నా తోడల్లుడివా?, మజాక్‌ చేయడానికి’’ అంటూ వెంకీ బదులిస్తాడు. ‘‘కాలం కలిసి వస్తే అవుతానేమో’’.. అంటూ దానికి వరుణ్‌ కౌంటర్‌ ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఈ చిత్ర ప్రీమియర్‌ షోలను అమెరికాలో జనవరి 11 నుంచే నిర్వహించనున్నారు.








Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.